UA-35385725-1 UA-35385725-1

ఆ రాష్ట్రంలోనే జర్నలిస్టుల హత్యలు!

ఆ రాష్ట్రంలోనే జర్నలిస్టుల హత్యలు!

జర్నలిస్టులపై దాడులు, కేసులు, అరెస్టులు
12 మంది హత్య – సీఏఏజే నివేదికలో వెల్లడి
పాత్రికేయులంతా భయపడాల్సిందే!
పత్రికాస్వేచ్ఛకు బ్రేకులు వేస్తున్న నేతలు, మాఫియాలు

న్యూఢిల్లీ: దేశంలోకెల్లా ఆ రాష్ట్రంలోనే జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే కేసులు పెట్టడం, ఇష్టానుసారం అరెస్టులు చేయడం ఎక్కువైంది. పైగా గడిచిన ఐదేళ్లలో ఏకంగా 12 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదో తెలుసా? ఇంకేముంది? ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రమే! ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయఢంకా మోగించింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి విజయం సాధించారు. వరుసగా రెండోసారి ఆయన సీఎం అయ్యారు. 2017లో తొలిసారి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు అంటే గడిచిన ఐదేళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పాత్రికేయులపై 138 కేసులు నమోదు అయ్యాయి. 48 మంది జర్నలిస్టులపై భౌతిక దాడులు జరిగాయి. 66 మంది అరెస్టుకు గురయ్యారు. 12 మంది హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని పాత్రికేయులపై దాడుల వ్యతిరేక కమిటీ (సీఏఏజే) రెండు వారాల క్రితం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ముప్పు ఏమిటంటే, మళ్లీ అదే యోగి ఆదిత్యనాథ్‌ యూపీ సీఎంగా రావడంతో పాత్రికేయులంతా భయపడుతున్నారు. 2020, 2021లో మహమ్మారి వేళ ఇటువంటి 78 శాతం కేసులు నమోదు అయినట్లు నివేదిక తెలిపింది. 2017 నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఉత్తరప్రదేశ్‌లోని జర్నలిస్టులపై 138 కేసులు నమోదయ్యాయని వెల్లడిరచింది. ఉత్తరప్రదేశ్‌ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (యూపీ పీయూసీఎల్‌)తో కలిసి ఈ నివేదికను సీఏఏజే వెలువరించింది. పాత్రికేయుల హత్య, భౌతిక దాడులు, ట్రయిల్‌ లేదా అరెస్టు, కస్టడీ లేదా బెదిరింపులు/నిఘాగా నాలుగు వర్గాలుగా విభజించారు. 2020లో 52, 2021లో 57 కేసులు నమోదు అయ్యాయి. 2020లో అధికంగా ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరు జర్నలిస్టులు నవీన్‌ గుప్తా (కాన్పూర్‌, బీహార్‌లోని హిందుస్థాన్‌ వార్తాపత్రిక), రాజేశ్‌ మిశ్రా (గాజీపూర్‌లోని దైనిక్‌ జాగ్రన్‌) కాల్చివేతకు గురయ్యారు. 2018, 2019 సంవత్సరాల్లో జర్నలిస్టుల హత్యలు జరగలేదని నివేదిక చెబుతోంది. 2020లో ఏడుగురు పాత్రికేయులు రాకేశ్‌ సింగ్‌, సూరజ్‌ పాండే, ఉదయ్‌ పాశ్వాన్‌, రతన్‌ సింగ్‌, విక్రమ్‌ జోషి, ఫరాజ్‌ అస్లం, శుభమ్‌ మణి త్రిపాఠి హత్యకు గురయ్యారు.
ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టులే…!
హత్యకు గురైన వారిలో అత్యధికులు ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టులే. అవినీతిని బయట పెట్టినందుకు బలరాంపూర్‌లోని ఇంటిపై దాడి చేసి దానికి నిప్పు పెట్టిన తర్వాత స్థానిక వార్తాపత్రిక రాష్ట్రీయ స్వరూప్‌ పాత్రికేయుడు రాకేశ్‌ సింగ్‌ హత్యకు గురయ్యారు. ఇసుక మాఫియా గుట్టు రట్టు చేసినందుకు బెదిరింపుల నేపథ్యంలో రక్షణ కల్పించాలని ఉన్నావో జర్నలిస్టు శుభమ్‌ మణి త్రిపాఠి పోలీసులను కోరారు. పోలీసులు స్పందించేలోగానే కాల్చివేతకు గురయ్యారు. టీవీ జర్నలిస్టు రతన్‌ సింగ్‌ను బల్లియాలో కాల్చి చంపారు. గాజియాబాద్‌లో పట్టపగలే విక్రమ్‌ జోషిని కాల్చేశారు. జర్నలిస్టు ఉదయ్‌ పాశ్వాన్‌, ఆయన భార్యను బర్వాది గ్రామం, సోన్‌బద్రాలోని దుండగులు చావబాదారు. ఉన్నావోలోని ఆంగ్ల పత్రిక పాత్రికేయుడు సూరజ్‌ పాండే అనుమానస్పదంగా చనిపోగా ఆయన మృతదేహం రైల్వే ట్రాక్‌పై లభ్యమైంది. పోలీసులు ఆయన మరణాన్ని ఆత్మహత్యగా పేర్కొనగా, అది హత్య అని బాధిత కుటుంబం పేర్కొంది. ఈ కేసులో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ తర్వాత అరెస్టు అయ్యారు. పోలీసు ఇన్ఫార్మర్‌ అనే అనుమానంతో కౌశంబీకి చెందిన పైగామే దిల్‌ కరస్పాండెంట్‌ ఫరాజ్‌ అస్లమ్‌ను హత్య చేశారు. 2021లో ఇద్దరు జర్నలిస్టులు సులభ్‌ శ్రీవాత్సవ, రమన్‌ కశ్యప్‌ హత్యలు సంచలనంగా మారాయి. ప్రతాప్‌ఘర్‌లోని లిక్కర్‌ మాఫియా అవినీతిని బయటపెట్టిన శ్రీవాత్సవ తనకు ప్రాణగండం ఉన్నదని రక్షణ కల్పించాలని పోలీసులను కోరినప్పటికీ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై చర్యలను తీసుకోకుండా హత్యను ప్రమాదంగా చూపే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ ప్రకటనను ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా జారీచేసింది. లఖింపూర్‌ ఖేరిలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీష్‌ తన ఎస్‌యూవీతో రైతులను తొక్కి చంపిన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో జర్నలిస్టు రమన్‌ కశ్యప్‌ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పీయూసీఎల్‌తో పాటు దర్యాప్తు బృందం దీనిని పథకం ప్రకారం చేసినదిగా ధృవీకరించింది. 2022లో షహరన్‌పూర్‌లో పట్టపగలు జర్నలిస్టు సుధీర్‌ సైనిని కొట్టి చంపారు. ఈ విధంగా హత్యకు గురైన జర్నలిస్టుల సంఖ్య 12కుపైగానే ఉండవచ్చు అని సీఏఏజే నివేదిక పేర్కొంది. ఈ దాడులు చాలా వరకు రాష్ట్ర యంత్రాంగమే జరిపిందన్న ఆరోపణలు ఉన్నాయి. విచిత్రమేమిటంటే, రెండు లాక్‌డౌన్‌ల కాలంలో జిల్లాలు, మండల స్థాయిల్లో జర్నలిస్టులపై దాడులకు సంబంధించి అనేక కేసులు వెలుగులోకి రాలేదని సీఏఏజే నివేదిక తెలిపింది. ఆ వివరాలు కూడా వచ్చిఉంటే ఈ సంఖ్య పెరిగేది.
విధుల్లో ఉన్నప్పుడే దాడులు
పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులపై దాడులు జరిగాయి. పాత్రికేయులకు నోటీసులు, ఎఫ్‌ఐఆర్‌లు, అక్రమ అరెస్టులు, నిర్బంధనలు, బెదిరింపులు, హింసను రాష్ట్ర యంత్రాంగం రెచ్చగొట్టిందని నివేదిక చెబుతోంది. జర్నలిస్టులపై భౌతిక దాడుల ఘటనల జాబితా చాలా పెద్దదిగా ఉందని కనీసం 50 మంది జర్నలిస్టులపై ఐదేళ్లలో భౌతిక దాడులు జరిగాయని నివేదిక తెలిపింది. దాడికి పాల్పడిన వారిలో పోలీసులు, రాజకీయ నేతలు, బలశాలులు, సామాన్యులు ఉన్నారు. కరెస్పాండెంట్‌ డ్యూటీలో ఉన్న సమయంలో వారిపై చాలా వరకు దాడులు జరిగాయి. 2020లో జర్నలిస్టులపై దాడులు బాగా పెరిగాయి. 2021లో ఈ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. సీఏఏజే నివేదిక ప్రకారం 2021లో నమోదు అయిన కేసులు చాలా వరకు పోలీసు వేధింపులకు సంబంధినవే ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో జర్నలిస్టులపై భౌతిక దాడులు జరిగినట్లు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు అమేథి, కౌశంబీ, కుండా, సీతాపూర్‌, గాజియాబాద్‌లలో జర్నలిస్టులపై దాడులు జరిగాయి. జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు 2020, 2021 సంవత్సరాలు సాక్షిగా ఉన్నాయని సీఏఏజే నివేదిక పేర్కొంది. వైద్య నిర్లక్ష్యం, క్వారంటైన్‌ కేంద్రాలలో నిర్వహణా లోపం, పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై వార్తలు రాసిన జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు నమోదు చేశాయి. మధ్యాహ్న భోజనం కింద రొట్టె, ఉప్పును విద్యార్థులకు వడ్డించడం, లాక్‌డౌన్‌లో ముసాహర్‌ వర్గానికి చెందిన పిల్లలను బలవంతంగా గడ్డి తినిపించడం, విద్యార్థులతో స్కూలు శుభ్రం చేయించడంపై వార్తాలకుగాను పాత్రికేయులపై కక్షసాధింపునకు యోగి ప్రభుత్వం పూనుకుంది. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనంగా నాసిరకం ఆహారం ఇవ్వడాన్ని రిపోర్టు చేసిన జర్నలిస్టు పాశ్వాన్‌ జైశ్వాల్‌ను పోలీసులు వేధించారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకొని ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించేంత వరకు జైశ్వాల్‌పై పోలీసుల దురాగతాలు కొనసాగాయి. స్థానిక దినపత్రిక జన సందేశ్‌పై కక్షసాధింపుగా ఆ పత్రికకు ప్రకటనలను యోగి ప్రభుత్వం నిలిపివేసింది. 2019, సెప్టెంబరు 7న స్కూలు ఆవరణను స్కూలు పిల్లలతో శుభ్రం చేయించడాన్ని రిపోర్టు చేసినందుకు ఆజంఘర్‌కు చెందిన ప్రాంతీయ జర్నలిస్టు సంతోష్‌ జైశ్వాల్‌ను నిర్బంధించారు. లాక్‌డౌన్‌ సమయంలో కోవిడ్‌ పరిస్థితి దిగజారడంపై వార్తలు రాసినందుకు 55 మంది జర్నలిస్టులు, సంపాదకులపై కేసులు పెట్టగా చాలా మందిని అరెస్టు చేసినట్లు సీఏఏజే నివేదిక వెల్లడిరచింది. ప్రముఖ జర్నలిస్టులనూ లక్ష్యంగా చేశారని తెలిపింది. ఐ లాక్‌డౌన్‌ వేళ అత్యవసర ఆహార మద్దతు లేదని, గ్రామంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని స్క్రోల్‌ డాట్‌ ఇన్‌ ఎడిటర్‌ సప్రియా శర్మపై తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వార్తలు ఇచ్చారని ఆరోపిస్తూ వారణాసి, రామనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని దొమారి గ్రామానికి చెందిన మాలా దేవి ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదుచేశారు. జర్నలిస్టులపై దాడులను ఆపడానికి యూనియన్లు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం వుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టుల పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు.

(Story: ఆ రాష్ట్రంలోనే జర్నలిస్టుల హత్యలు!)

See Also: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1